Tuesday, March 17, 2015

ఓ గవ్వ కధ


అనగనగా.... ఓ బాబు ఉండేవాడు. ఓక రోజు గుడి లో ఓక గవ్వ దొరికింది.  దేవుడిచ్చిన గవ్వ అని దాన్ని జేబులో వేసుకుని ఇంటికి వెళాడు.
ఇంతకీ గుడికి ఎందుకు వెళ్ళాడంటే, తరువాతరోజు పరీక్ష! మరేమో సరిగ్గా చదవలేదాయే. శుంఠ కదా. దేవుడిమీద భారం వేసేయడానికన్నమాట!
తరువాతరోజు పరీక్ష ఛాలాబాగా చించాసాడు. వాడికే నమ్మకం కుదరలేదు. అంతా దేవుడి మహత్యం అనుకున్నాడు. సరే ఇక ఇంటికి వెళ్ళి అమ్మ ముందు రెచ్చిపోదాం అని బండి తాళం కోసం జేబులో చెయ్యి వేశాడు.  తాళం బదులుగా గవ్వ దొరికింది! ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది, బాబుకి మొత్తం అర్థం అయ్యింది.
అది మొదలు, బాబు ఎక్కడికి వెళ్ళినా జేబులో గవ్వ లేనిదే అడుగు బయటికి వెయ్యడం లేదు. భ్రష్టుడు కదా ఆఖరికి పాయఖానాకి కూడా తీసుకువెళ్ళాడు, పని బాగా జరుగుతుందని. అమ్మ కిరాణా దుకాణానికి వెళ్లి పంచదార తెమ్మంటే, బాబు నాన్ననడిగి డబ్బులు తీసుకుని, బండి తాళం తీసుకొని అలా గుమ్మం వరకు వెళ్లి ఒక్కసారిగా తిరిగి లోనికి పరుగుపెట్టాడు. ఇది చూసిన నాన్నగారికి ఏంజరిగిందో అని పరుగున వెళ్ళారు. తీరా చూస్తే,  బాబు కంగారుగా విప్పేసిన బట్టల్లో దేవుకుంటుంన్నాడు. ఉన్నట్లుండి ఏమీ జరగనట్లుగా  వెళ్ళిపోసాగాడు,  ఏమైందిరా అని నాన్న అడుగుతున్నా వినపడనట్లుగా. గవ్వ దొరికింది కదా!

ఓ రోజు చెత్తబుట్ట పడిన శబ్దానికి, దొంగ పిల్లి ముండకి అప్పుడే తెల్లారినట్లుంది అని, దాన్ని తరమటానికి చీపురు పట్టుకుని బయటకు వచ్చింది. తీరా చూస్తే అక్కడ పిల్లి బదులు బాబు చెత్తబుట్ట తిరగేస్తున్నాడు. దగ్గరకెళ్ళి ఏంచేస్తున్నావురా? అన్నది.  అమ్మ మాటవిన్న బాబు వెనక్కి తిరిగి చూశాడు, కళ్ళల్లో నీళ్ళతో. అది చూసిన అమ్మకి విపరీతమైన నీరసమొచ్చేసి గోడకానుకొని చతికిలపడిపోఇంది! సరిగ్గా తినదుకదా! కొంత సేపటికి తేరుకొని చెత్తబుట్ట దగ్గర చుాసింది బాబుతో మాట్లాడుదామని. కాని, అక్కడ కింద పడిపోఇన బుట్ట, చెత్తా తప్ప బాబు లేడు. ఇల్లంతా వెతుకుతూ బాబు గదిలోకి వెళ్లింది. అది గదిలాలేదు, చెత్తకుప్పను తలపిస్తోంది! మొత్తం గది అంతా చిందరవిదరగా ఉంది, కుక్కలు చంపిన విస్తరిలా! బాబు బాగా వెతికాడు, కాదుకాదు దేవులాడాడు. ఇంతకూ బాబు కనపడలేదు ఆ చెత్తలో. అమ్మకి మళ్ళి కంగారు మొదలు! జాగ్రత్తగా ఆగోడా ఈగోడా పట్టుకొని ఇల్లంతా వెతికిన ది, బాబు కనపడకపోయేసరికి గుబులు మొదలైంది, మళ్ళీ పడిపోయేలోగా ఆయనకి చెప్పాలని ఓపిక చేసుకొని చరవాణిలో (అదేనండీ మొబైల్ ఫోను) విషయం చేరవేసింది. నాన్నగారు ఆఘమేఘాలమీద వచ్చారు. మొత్తం చుాసి చిరుమందహాసంతో తిన్నగా ఇంటి పక్కనున్న చెత్తకుప్ప దగ్గరకు వెళ్లారు. ఈయనొకరు, ఏమన్నా చెప్పటం పాపం నవ్వుతారు అని సణుగుకుంటుా వెనక్కాలే వెళ్ళింది.

విందు భోజనం తరువాత ఎత్తి పడేసిన ఆకుల కుప్పలో ఆరాటంతో తిరగతోడే పందిలా బాబు చెత్తకుప్పను తిరగేస్తున్నాడు. దగ్గరకెళ్ళి ఏంచేస్తున్నావురా అని పిలిచారు. తిరిగి చుాసిన బాబు ముఖంలో అంతులేని ఆవేదన. నెమ్మదిగా వచ్చాడు, లోనికి వెళ్లి స్నానం చేసిరా అన్నారు. ఓ రెండు గంటల పాటు స్నానం చేసి వచ్చాడు. కంపు కొంత తగ్గింది.  ఏంజరిగిందో అని ఆరా తీశారు నాన్నగారు. ఆవదం తాగినట్టు, పచ్చి వెలక్కాయ తిన్నట్టు మొహం పెట్టి చుాస్తున్నాడు తప్ప మాట్లాడట్లేదు. ఏం ముంచుకొచ్చావురా? అని అడిగింది అమ్మ ఊగిపోతు. సమాధానం లేదు. ఎక్కడలేని కోపం వచ్చింది నవ్వుతున్న ఆయన్ను చుాసి. ఏంపట్టనట్టు ఏంటానవ్వు? కనుక్కోండి అంది చిటపటలాడుతుా.
చెప్పమ్మా ఏంటో అని అన్నారు నాన్న బుజ్జగింపుగా. ఒక నిమిషం ఆగి "గవ్వ పోఇంది" అన్నాడు.

నే చెప్పాను కదే ఏదో చిన్న విషయమే ఉంటుందని. ఇంత చేశాడు, ఒక చిన్న గవ్వ కోసం, గవ్వగాడు అని నవ్వుతూ లేచి వెళ్ళిపోయారు.
పనికిమాలిన వెధవ, నువ్వేంచేశావో అని తెగ కంగారు పడ్డాను, తొట్టెడు నీళ్ళు సబ్బు తగలేశావ్. గవ్వదిక్కుమాలినోడా అనుకుంటుా రుసరుసా వెళ్ళపోఇంది.
ఈ పెద్దోళ్ళున్నారే అస్సలు అర్ధం చేసుకోరు. వీళ్ళకేంతెలుసు నా గవ్వ గురించి? అనుకుంటూ గుడికి బయలుదేరాడు మన బాబు.
ఇంతకూ బాబు బీటెక్ చదువుతున్నాడు. ఎందుకు చెప్పానంటే, పొరపాటున బాబును అపార్ధం చేశుకనంటారేమో ఏదో బడికెళ్ళే పిల్లవాడు అని.

No comments:

Post a Comment